Search Stotra Ratnakaram

Sunday, May 14, 2017

మాతృ పంచకం (తాడేపల్లి పతంజలి గారి తాత్పర్యంతో)

🌻🌻🌻🌻🌻🌻
" మాతృ పంచకం "
(డా.తాడేపల్లి పతంజలి గారి తాత్పర్యంతో)
🌻🌻🌻🌻🌻🌻

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

(అర్థ తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరcణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.
💐💐💐💐💐💐💐💐1.
ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.

తాత్పర్యము:

అమ్మా !
"నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా ! , నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి " అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను.నన్నుక్షమించు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

2.
అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.

తాత్పర్యము:

పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼

3.
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

తాత్పర్యము:

అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను(కడుపునొప్పి) అనుభవించావో కదా !
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా ! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు.
ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

4.
గురుకు లముప సృ త్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.

తాత్పర్యము:

కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

5.
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.

తాత్పర్యము:

అమ్మా ! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని(ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమని కొందఱు "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు) చదవలేదు . నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సేకరణ :-శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి.

9 comments:

తిరువాయిపాటి వరదయ్య said...

రత్నమనుౘు నను చిరంజీవి యనుౘును ముద్దులాడి నావ ముత్యమనుౘు
కంటి వెలుగు వన్న కన్నతల్లికి నోట తండులములబెట్టు తనయుడైతి.

తిరువాయిపాటి వరదయ్య said...

ప్రసవకాలమందు పంటిబిగువున బాధ నోర్చుకొనుౘు పుట్టునొసఁగువేళ
శివునితల్లి దండ్రి శ్రీకృష్ణుని స్మరింఛి-నావు తల్లి!వందనములు నీకు.

Dr.R.P.Sharma said...

వరదయ్యగారూ! చక్కని అనువాదాలు.
మాతృపంచకం అన్ని శ్లోకాలకూ మీ చక్కని పద్యానువాదాలు వెలువడాలని కోరిక.

తిరువాయిపాటి వరదయ్య said...

తనువుడస్సె కళలు తప్పిన మొగము నా-మలము మూత్రములను మలినమైన
పడక నొక్కసాలు భరియించి తీవు మా-యమ్మ జేజె సైపుమమ్మ నన్ను.
కల యతిగను నన్ను కనుగొని వెతజెంది-గురుకులమును జేరి కుములుతల్లి
బాధ జెందిరచటి వారందరును నీదు-పాదములకొనర్తు వందనములు.
కాలహరణ మాయె కాలడిలో స్వధా-పలుకు శాస్త్ర విధిని పలుకలేదు
కర్ణములను తారకము చదువగ రాని-వాడ దయను జూచు వరదుడునిను.

Unknown said...

ఈ మాతృ పంచకము అనే స్తోత్రములను ప్రతి తెలుగు బిడ్డలు కనీసము ఒక్కసారి ఐనా చదవ వలసిందే

Unknown said...

మాతృపంచకం అన్ని శ్లోకాలకూ మీ చక్కని పద్యానువాదాలు వెలువడాలని కోరిక.వందనములు నీకు.

sitarama anjaneya sarma said...

superb

Dr.Tadepalli patanjali said...

మాతృపంచకమునకు స్వామి దయతో తాత్పర్యాలు వ్రాసి ఫేస్ బుక్ లో ప్రచురించిన వాడిని నేను. అది ఇలా చేతులు మారుతూ నా పేరు లేకుండానే సేకర్త పేరుతో మీ స్తోత్ర రత్నాకరములో చేరింది. ధన్యవాదాలు

Dr.R.P.Sharma said...

అయ్యా నమో నమః. మీ వంటి పెద్దల వాక్కులు నా బ్లాగులో చేరినందుకు ధన్యుడను. మీరిచ్చిన సమాచారాన్ని శీర్షికలో చేర్చాను.
ధన్యవాదపూర్వకనమస్కారాలు.
- రామక పాండురంగ శర్మ.

Post a Comment

Followers